ఏకపక్ష నిర్ణయాలు, భారీ అవకతవకలకు పాల్పడిన కెసిఆర్ ప్రభుత్వం
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలపై నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సంచలన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఏకపక్ష నిర్ణయాలు, ఆర్థిక అవకతవకలు, ప్రాజెక్టు వైఫల్యానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులని స్పష్టం చేసింది.
కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం, కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి రూపకల్పన జరిగినప్పటి నుంచి 2023లో దెబ్బతినే వరకు అనేక ఉల్లంఘనలు, భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయి. ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ, బ్యారేజీలలో నీటిని నింపడంతో సహా ప్రతి అంశంలో గత ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారని నివేదిక పేర్కొంది. రాజకీయ కార్యనిర్వాహకుడిగా (పొలిటికల్ ఎగ్జిక్యూటివ్) ఉండాల్సిన ముఖ్యమంత్రి, పరిపాలనా కార్యనిర్వాహకుడిగా (అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్) పని చేశారని కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ అవకతవకలు, వైఫల్యాలకు నాటి ముఖ్యమంత్రి స్వయంగా, పరోక్షంగా బాధ్యులని కమిషన్ స్పష్టం చేసింది.
ఈ తప్పుడు నిర్ణయాలు, నిర్వహణ లోపాల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని నివేదిక పేర్కొంది. చట్ట ప్రకారం గత ముఖ్యమంత్రిపై తగిన చర్యలు తీసుకొనే స్వాతంత్ర్యం ప్రస్తుత ప్రభుత్వానికి ఉందని కమిషన్ సూచించింది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు, నాటి మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లను కూడా పలు అంశాల్లో కమిషన్ తప్పుపట్టింది. నీటి లభ్యత లేనందునే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చామన్న వాదన సహేతుకం కాదని కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా లోపాలు, ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని… కొన్ని ఏజెన్సీలకు అనుచిత లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని కమిషన్ పేర్కొంది.
తెలంగాణకు జీవనాడిగా పేర్కొంటూ రూ. వేల కోట్లు ఖర్చుచేసి నిర్మించిన ఈ బ్యారేజీల విషయంలో సరైన ప్రణాళిక లేకుండా హడావుడిగా వ్యవహరించారని కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ నివేదిక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
