ఏపీ విద్యా, ఐటీ సంస్కరణలకు అంతర్జాతీయ గుర్తింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక ‘ప్రత్యేక సందర్శన కార్యక్రమం (Special Visits Programme – SVP)’లో పాల్గొనడానికి ప్రత్యేక ఆహ్వానం అందింది. రాష్ట్ర విద్యా రంగంలో కీలక సంస్కరణలతో ‘ఏపీ విద్యా నమూనా’ను ముందుండి నడుపుతున్న లోకేష్‌కు ఇది ఒక గొప్ప గౌరవంగా పరిగణించబడుతోంది.
ఢిల్లీలోని ఆస్ట్రేలియన్ హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ పంపిన ఒక లేఖ ద్వారా ఈ ఆహ్వానం అందింది. మానవ వనరులు, సాంకేతికత, ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ చూపుతున్న నాయకత్వాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న ఈ అభివృద్ధిని గుర్తించి, మంత్రి నారా లోకేష్‌ను SVPలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించినట్లు లేఖలో స్పష్టం చేసింది.
గత 20 సంవత్సరాలుగా భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంతో అనుబంధం కలిగి ఉన్నారని ఆ లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం 2001లో ఈ ప్రత్యేక సందర్శన కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. అటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు నారా లోకేష్‌కు ఆహ్వానం లభించడం, ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలకు అంతర్జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య విద్యా, సాంకేతిక రంగాలలో సహకారం మరింత విస్తరించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
