సీఎం రేవంత్రెడ్డి ప్రకటన
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని తెలంగాణ శాసనసభ నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం శాసనసభలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన సుదీర్ఘ చర్చకు సమాధానమిస్తూ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ (REC), పీఎఫ్సీ (PFC) వంటివి భాగస్వామ్యమై ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభకు వివరించారు. ఈ నేపథ్యంలో కేసును సీబీఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తోందని ఆయన తెలిపారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్నవారిని కచ్చితంగా శిక్షించాలని తమ ప్రభుత్వం కోరుకుంటున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
ప్రాజెక్టులో అక్రమాలపై ఇప్పటికే నివేదికలు ఇచ్చిన ఎన్డీఎస్ఏ (NDSA), విజిలెన్స్, కాగ్ (CAG), జస్టిస్ ఘోష్ కమిషన్ వంటి సంస్థలన్నీ గత ప్రభుత్వాన్ని, నాటి పాలనలో ఉన్న పెద్దల్ని తప్పుపట్టాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. తమ పరిధిలో ఉన్న ఏ సంస్థ దర్యాప్తు చేసినా, తమ చిత్తశుద్ధిని శంకించే అవకాశం ఉందని, అందుకే ఎలాంటి శషభిషలకు తావు లేకుండా కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు రేవంత్రెడ్డి ప్రకటించారు.
ఆదివారం అర్థరాత్రి దాటాకా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటన అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో సీబీఐ దర్యాప్తునకు శాసనసభ నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
