నల్గొండలో కాంగ్రెస్-బీజేపీ ఘర్షణల నేపథ్యంలో ఉద్రిక్తత
హైదరాబాద్ / నల్గొండ:
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావును పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా తార్నాకలోని ఆయన నివాసంలో గృహనిర్బంధం (హౌస్ అరెస్ట్) చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య తీవ్రస్థాయిలో చెలరేగిన పరస్పర దాడుల నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంపై బీజేపీ శ్రేణులు కోడిగుడ్లతో దాడికి పాల్పడగా, దానికి ప్రతిగా బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వరుస ఘటనలతో నల్గొండలో ఇరు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దాడికి గురైన జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి కుటుంబాన్ని స్వయంగా కలిసి పరామర్శించేందుకు రాంచందర్‌రావు నల్గొండ పర్యటనకు సిద్ధమయ్యారు. అయితే ఆయన పర్యటనతో నల్గొండలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భావించిన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు, ఆయన బయలుదేరక ముందే తార్నాక నివాసం వద్ద భారీగా మోహరించి గృహనిర్బంధం విధించారు. బాధిత పార్టీ నేతలను పరామర్శించేందుకు వెళ్తుంటే ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ హౌస్ అరెస్టులు చేయడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని బీజేపీ నాయకత్వం ఈ సందర్భంగా మండిపడింది.
