వాణిజ్య గ్యాస్, పాలు, కార్ల ధరలు పైపైకి.. అమలులోకి వచ్చిన 7 కీలక మార్పులు!
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 1 ప్రారంభం కావడంతోనే సామాన్యుల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపే పలు కీలక మార్పులు దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లతో పాటు నిత్యావసరమైన పాల ధరలు, సీఎన్జీ, కార్ల ధరలు పెరగడంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ఇదే సమయంలో విమాన ప్రయాణాలు, ఎల్పీజీ సబ్సిడీకి సంబంధించి ప్రభుత్వ నిబంధనల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.
సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వచ్చిన 7 ప్రధాన మార్పుల వివరాలు:
1. వాణిజ్య సిలిండర్ల ధరలు పెంపు: చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను సగటున ₹11.50 మేర పెంచాయి. కోల్‌కతాలో దీని ధర ₹2,872.50 నుంచి ₹2,884కి చేరింది. 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర కూడా ₹2 పెరిగి రీఫిల్లింగ్ ధర ₹764కి చేరింది. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాలు, టీ, స్నాక్స్ ధరలతో పాటు క్యాటరింగ్ ఛార్జీలు పెరిగే అవకాశముంది.
2. ముంబైలో లీటర్ పాలపై ₹9 పెంపు: బాంబే మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ టోకు పాల ధరను లీటరుకు ₹9 పెంచి ₹102కు చేర్చింది. ఈ పెంపు 2027 ఫిబ్రవరి వరకు అమలులో ఉంటుంది. పశుగ్రాసం, రవాణా ఖర్చులు పెరగడమే ఇందుకు కారణం. తమిళనాడులోనూ ఆవిన్ పాల సేకరణ ధర లీటరుకు ₹3 పెరిగింది. రాబోయే పండుగ సీజన్లో స్వీట్లు, పాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.
3. ఇ-కేవైసీ లేకుంటే నిలవనున్న ఎల్పీజీ సబ్సిడీ: గృహ వినియోగ ఎల్పీజీ కనెక్షన్లకు బయోమెట్రిక్ ఇ-కేవైసీ పూర్తి చేసే గడువు ఆగస్టు 31తో ముగిసింది. ఇంకా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని వినియోగదారులకు ప్రభుత్వం అందించే గ్యాస్ సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించి వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
4. బోర్డింగ్ పాస్‌లపై ఇక స్టాంపింగ్ రద్దు: భారత్ నుంచి విదేశాలకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో ఊరట లభించింది. ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద బోర్డింగ్ పాస్‌లపై స్టాంపులు వేసే విధానాన్ని రద్దు చేస్తూ డిజిటల్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రయాణికులు తమ ఫోన్లలోని ఇ-బోర్డింగ్ పాస్‌లను చూపించి వేగంగా ప్రయాణించవచ్చు.
5. టాటా, హ్యుందాయ్ కార్ల ధరలు పైపైకి: వాహన తయారీ వ్యయం, విడిభాగాల ధరలు పెరగడంతో టాటా మోటార్స్ తమ కార్ల వేరియంట్లపై గరిష్టంగా ₹25,000 వరకు ధరలను పెంచింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా వాహనాల ధరలను 1% వరకు పెంచడంతో కొత్తగా కార్లు కొనేవారిపై భారం పడనుంది.
6. పెరిగిన సీఎన్జీ, పీఎన్జీ రేట్లు: మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) సీఎన్జీ ధరను కిలోకు ₹2, పీఎన్జీ (పైప్డ్ గ్యాస్) ధరను యూనిట్‌కు ₹1 చొప్పున పెంచింది. ముంబైలో సీఎన్జీ ధర కిలో ₹88కి చేరింది. ముంబై, థానే, రాయగడ్ సహా పలు జిల్లాల్లోని దాదాపు 13 లక్షల మంది వాహనదారులపై, 30 లక్షల గృహ వినియోగదారులపై దీని ప్రభావం పడనుంది.
7. విమాన ఇంధనం (ATF) మరింత ప్రియం: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో దేశంలో విమాన ఇంధన (ఏటీఎఫ్) ధర వరుసగా రెండో నెలలోనూ 5.46% (లీటరుకు ₹6.28) పెరిగింది. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయంలో ఇంధన ఖర్చే ప్రధాన వాటా కావడంతో రాబోయే రోజుల్లో దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్ల ఛార్జీలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
