జెరూసలేం: ఫ్లైదుబాయ్ విమానాన్ని హైజాక్ కాకుండా కాపాడి, వందలాది మంది ప్రాణాలను నిలబెట్టిన భారతీయ పైలట్ క్యాప్టెన్ స్మిత్ మచ్ఛర్ (Smit Machchhar) అరుదైన గౌరవాన్ని దక్కించుకోనున్నారు. ఆయన ప్రదర్శించిన సాహసానికి గుర్తింపుగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘సివిలియన్ బ్రేవరీ అవార్డ్’ (పౌర వీరతా పురస్కారం) ప్రకటించింది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హర్జోగ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
అసలు ఏం జరిగిందంటే..?
గత నెల సెప్టెంబర్ 30, 2026న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం (Flight 1073) లో మొత్తం 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్ పౌరులే.విమానం గాల్లో ఉండగా, ఒమన్‌కు చెందిన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి ఒక్కసారిగా క్యాబిన్ యాక్స్‌తో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై తీవ్రంగా దాడి చేశాడు.విమానాన్ని కూల్చివేయాలనే ఉద్దేశంతోనే అతను ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు.
ఈ ఊహించని పరిణామానికి విమానం వేగంగా కొన్ని సెకన్లలోనే వేలాది అడుగుల ఎత్తుకు దిగిపోయింది.దానితో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
గాయపడినా వెనకడుగు వేయని పైలట్
ఈ దాడిలో క్యాప్టెన్ స్మిత్ మచ్ఛర్ తీవ్రంగా గాయపడ్డారు.అయినప్పటికీ ఆయన తన ప్రాణాలను లెక్కచేయకుండా అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. రక్తమోడుతున్న శరీరంతోనే లోపలి నుంచి కాక్‌పిట్ తలుపులు తెరిచేందుకు ప్రయత్నించి విజయవంతమయ్యారు.
దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు, తోటి సిబ్బంది ఆ దుండగుడిని అణచివేశారు. విమానంలోని ఇతర పైలట్ల సహాయంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చి, సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఇజ్రాయెల్ అధ్యక్షుడు ప్రత్యేక ప్రకటన
జెరూసలేంలో జరిగిన కార్యక్రమంలో ఆరుగురు ఇజ్రాయెల్ పౌరులకు పౌర వీరతా పతకాలను ప్రదానం చేసిన అధ్యక్షుడు ఐజాక్ హర్జోగ్.. అదే వేదికపై భారతీయ పైలట్ క్యాప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు కూడా ఈ పురస్కారాన్ని ప్రకటించారు. మచ్ఛర్ ప్రదర్శించిన తెగువ, వృత్తిపరమైన నిబద్ధత కారణంగానే పెను ప్రమాదం తప్పిందని ఆయన కొనియాడారు.
ప్రస్తుతం అబుదాబిలోని ఆసుపత్రిలో కోలుకుంటున్న మచ్ఛర్ పూర్తిగా ఆరోగ్యంగా తిరిగివచ్చిన తర్వాత ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సాహస ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, భారత్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న బలమైన బంధానికి ఇది మరో ప్రతీకగా నిలిచింది.
