తిరుపతి జిల్లా: తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆటోమోటివ్ విడిభాగాలను తయారు చేసే వెంచర్ ఆటోమోటివ్ పరిశ్రమలో ఈ ప్రమాదం సంభవించింది. సిబ్బంది అప్రమత్తతతో తక్షణ చర్యలు తీసుకోవడంతో పెను ప్రాణనష్టం తప్పింది.
ప్రమాదం జరిగింది ఇలా…
శ్రీసిటీలోని వెంచర్ ఆటోమోటివ్ పరిశ్రమలో ఉదయం 7 గంటల సమయంలో మిషనరీ విభాగంలో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పరిశ్రమలో దట్టమైన పొగ వ్యాపించింది. దీన్ని గమనించిన పరిశ్రమ సిబ్బంది వెంటనే అప్రమత్తమై యాజమాన్యానికి, శ్రీసిటీ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.
స్పందించిన అగ్నిమాపక సిబ్బంది
సమాచారం అందుకున్న వెంటనే శ్రీసిటీ ఇన్చార్జి అగ్నిమాపక శాఖ అధికారి రాజయ్య తన సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. సమయానికి ఫైర్ సిబ్బంది స్పందించడంతో మంటలు పక్క విభాగాలకు వ్యాపించకుండా ఆపగలిగారు.
భారీగా ఆస్తి నష్టం
ఈ అగ్నిప్రమాలంలో పరిశ్రమలోని కొన్ని యంత్రాలు పూర్తిగా కాలిపోయాయి. దీనివల్ల సుమారు రూ. 80 లక్షల నుంచి రూ. కోటి వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రమాద సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వారం రోజుల వ్యవధిలోనే మరో ఘటన..
శ్రీసిటీలోని టిల్ హెల్త్‌కేర్ (TIL Healthcare) పరిశ్రమలో ఇటీవల జరిగిన బాయిలర్ పేలుడు ఘటనలో ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆ విషాదం మరవక ముందే, వారం రోజులు గడవకండానే మరో పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం శ్రీసిటీ సెజ్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో పారిశ్రామిక వాడల్లో భద్రతా ప్రమాణాలు, ఆడిట్లపై ఆందోళన వ్యక్తమవుతోంది.
