మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారంలో 12 తుపాకుల చోరీ.. కేసు నమోదు
హైదరాబాద్ / సికింద్రాబాద్:
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్ ప్రాంగణంలో ఊహించని భారీ భద్రతా లోపం వెలుగుచూడటం రక్షణ, నిఘా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. మిలిటరీ కాంపౌండ్‌లోని ఆయుధాల నిల్వ గది (ఆర్మరీ) తాళాలు పగులగొట్టి గుర్తుతెలియని దుండగులు 12 ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అపహరించుకుపోయారు. ఈ ఘటనపై ఆర్మీ ఉన్నతాధికారులు బొల్లారం పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
పోలీసులు, ఆర్మీ నిఘా విభాగం సంయుక్తంగా దర్యాప్తును ముమ్మరం చేశాయి. రెజిమెంట్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను మల్కాజ్గిరి కమిషనరేట్ ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల యూనిట్లో చేరిన సిబ్బంది, బదిలీపై వెళ్లినవారు, విధుల నుంచి విడుదలైనవారితో పాటు ఆయుధాగారంలో పనిచేస్తున్న సిబ్బంది కదలికలపై ఆరా తీస్తున్నారు. భద్రతా సిబ్బందితో పరిచయాలు ఉన్నవారిని, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మద్రాస్ రెజిమెంట్ చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడతో కూడిన మూడంచెల పటిష్ట భద్రతా వ్యవస్థ ఉంది. రాకపోకల ద్వారాల వద్ద కఠినమైన తనిఖీలు, అత్యాధునిక సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుంది. ఆయుధాల భద్రతకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు ఉన్నప్పటికీ, ఇంతటి హై-సెక్యూరిటీ జోన్లోకి చొరబడి ఆయుధాల గది తాళాన్ని ఎలా పగులగొట్టారనే అంశం మిలిటరీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. లోపలి వ్యక్తుల సహకారం లేకుండా ఈ చోరీ సాధ్యం కాదనే అనుమానంతో ఆర్మీ అంతర్గత విచారణను కూడా వేగవంతం చేసింది.
