మంత్రివర్గంలో మార్పులపై హైకమాండ్‌తో మంతనాలు.. కేంద్ర మంత్రులతో భేటీలు
హైదరాబాద్ / న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం హస్తినకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అగ్ర నాయకత్వంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పార్టీ అంతర్గత వ్యవహారాలు, కేబినెట్ మార్పులు మరియు పెండింగ్ అభివృద్ధి ప్రాజెక్టుల సాధనే ప్రధాన ఎజెండాగా ఈ పర్యటన సాగనుంది.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ఏఐసీసీ అధిష్ఠానంతో ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించనున్నారు. పీసీసీ క్రమశిక్షణా కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా సురేఖపై చర్యలు తీసుకునే అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తోంది. ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు బలంగా ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. ఇదే క్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి వ్యవహారాన్ని కూడా చర్చించి, వీరిద్దరిపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌లతో వేర్వేరుగా సమావేశం కానున్నారు.
రాజకీయ అంశాలతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో సీఎం కీలక చర్చలు జరపనున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ ప్రాజెక్టు అనుమతులు, నిధుల సాధన కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను సీఎం కలవనున్నారు. అలాగే వరంగల్ సమీపంలోని మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ, విమాన రాకపోకలకు అవసరమైన క్లియరెన్సులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో చర్చించనున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సదస్సు, డిఫెన్స్ రంగానికి సంబంధించిన అంశాలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ రెండు రోజుల ఢిల్లీ పర్యటన తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది.
