హైదరాబాద్:
హైదరాబాద్ సైదాబాద్‌లోని ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో హిందూ విద్యార్థికి ఇస్లామిక్ మతపరమైన ప్రార్థనలను హోమ్‌వర్క్‌గా ఇచ్చారనే వివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ ఘటనపై వచ్చిన ఫిర్యాదును సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విద్యార్థుల మతంతో సంబంధం లేకుండా ఇస్లామిక్ పాఠాలు, ప్రార్థనలను నిర్బంధం చేశారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కానూంగో నేతృత్వంలోని ఎన్హెచ్ఆర్సీ బెంచ్ రాష్ట్ర అధికారులను ఆదేశించింది.
అసలేం జరిగింది?
సైదాబాద్‌లోని “సక్సెస్ ద జూనియర్ కాలేజ్/సక్సెస్ ది స్కూల్” అనే విద్యాసంస్థలో చదువుతున్న రెండవ తరగతి (Class 2) హిందూ విద్యార్థి డైరీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. జూలై 11 నాటి హోమ్‌వర్క్ డైరీ పేజీలలో.. మ్యాథ్స్, కంప్యూటర్ సబ్జెక్టులతో పాటు ‘దీనియాత్’ (Deeniyath) అనే సబ్జెక్టు కింద “1, 2 కల్మా చదవాలి” మరియు “సూరా ఫాతిహా చదవాలి” అని రాసి ఉంది. దాని కింద సదరు క్లాస్ టీచర్ సంతకం కూడా ఉంది.
తమ బిడ్డకు పాఠశాల మేనేజ్మెంట్ మతపరమైన హోమ్‌వర్క్ ఇచ్చి, కల్మా చదవాలంటూ ఒత్తిడి చేస్తోందని విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మతంతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ దీనిని నిర్బంధం చేయడంపై హిందూ సంఘాలు, నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు.
టీచర్‌ను తొలగించిన స్కూల్ యాజమాన్యం
ఈ వివాదం కాస్తా ముదరడంతో పాఠశాల యాజమాన్యం తక్షణమే స్పందించింది. విద్యార్థికి కల్మా, సూరా ఫాతిహాలను హోమ్‌వర్క్‌గా ఇచ్చిన సదరు ఉపాధ్యాయురాలు షేక్ ఆయిషా పర్వీన్‌ను గురువారం ఉద్యోగం నుండి తొలగిస్తూ (Terminate) నిర్ణయం తీసుకుంది.
పాఠశాల మేనేజ్మెంట్ జారీ చేసిన టెర్మినేషన్ లేఖలో.. ఆయిషా పర్వీన్‌ను తక్షణమే విధుల్లోంచి తొలగించడమే కాకుండా, భవిష్యత్తులో ‘సక్సెస్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్’ పరిధిలోని ఏ ఇతర విద్యాసంస్థలోనూ ఆమెకు ఉద్యోగం ఇవ్వకుండా శాశ్వతంగా అనర్హురాలిగా (Disqualified) ప్రకటిస్తున్నట్లు పేర్కొంది.
ప్రభుత్వ దర్యాప్తునకు ఆదేశం
సోషల్ మీడియాలో ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుండటంతో, ఎన్హెచ్ఆర్సీ ఈ కేసును తీవ్రంగా పరిగణించింది. పాఠశాలల్లో ఇలాంటి మతపరమైన నిర్బంధాలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తాయని భావించిన కమిషన్, దీనిపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అసలు నిజానిజాలను త్వరలోనే నివేదిక రూపంలో సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతానికి ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
