హైదరాబాద్: “తెలంగాణపై నాకు ఎంతో ప్రేమ ఉంది. అది రాజకీయాలకు అతీతమైంది. నన్ను హైదరాబాద్‌లో ఎలా అడుగు పెడతావ్ అని ప్రశ్నించడానికి మీరెవరయ్యా? నన్ను బెదిరించడానికి తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?” అంటూ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కొందరు వ్యక్తులు తనను తెలంగాణకు రాకుండా అడ్డుకుంటామని చేసిన హెచ్చరికలపై పవన్ ఘాటుగా స్పందించారు.
తనపై దాడులు చేస్తామంటూ బెదిరించిన వారికి సమాధానం ఇవ్వడానికే, తన అడ్రస్ తెలియాలనే ఉద్దేశంతోనే ఈరోజు తన సొంత నివాసంలో ప్రెస్‌మీట్ పెట్టానని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రాలోనే బెదిరింపులు ఎక్కువ.. వారాహికి అనుమతి ఇచ్చింది ఇక్కడి ప్రజలే!
తెలంగాణ ప్రజలు తనకు ఎన్నోసార్లు అండగా నిలిచారని పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. “నాకు తెలంగాణలో బెదిరింపుల కన్నా ఆంధ్రాలోనే బెదిరింపులు ఎక్కువగా ఉండేవి. గతంలో ఆంధ్రాలో నన్ను తిరగనివ్వం అన్నప్పుడు, నా ‘వారాహి’ వాహనానికి తిరిగే అనుమతి ఇచ్చింది ఇక్కడి తెలంగాణ ప్రజలే. జనసేన పార్టీని కూడా నేను తెలంగాణ నడిబొడ్డున ఏర్పాటు చేశాను. తెలంగాణ యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకొనే వ్యక్తిని నేను” అని ఆయన అన్నారు.
అధికారంపై ఆశ లేదు.. మార్పుపైనే నా ప్రేమ!
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులు తనను చాలాసార్లు కోరారని పవన్ పేర్కొన్నారు. అయితే తన ప్రయాణం పదవుల కోసం కాదని స్పష్టం చేశారు.
“ఆంధ్రాలోనే అధికారం కోరుకోని వాడిని, ఇక తెలంగాణలో అధికారం ఎందుకు కోరుకుంటాను? నాకు అధికారంపై ప్రేమ లేదు.. కేవలం మార్పుపైనే ప్రేమ. తెలంగాణ ప్రజలకు ఆంధ్రా ప్రజలపై ఎలాంటి విద్వేషం లేదు. ఒకవేళ ఇక్కడి ప్రజలు ద్వేషం పెంచుకుని ఉంటే.. ఒక్క ఏపీ వ్యక్తి కూడా ఇక్కడ ఉండగలిగేవారు కాదు. ఇప్పుడు నన్ను విమర్శించే వాళ్లెవరూ ఆదిలాబాద్ అడవుల్లో తిరగలేదు.. కానీ నేను తెలంగాణ నలుమూలలా తిరిగిన వ్యక్తిని” అని వ్యాఖ్యానించారు.
విభజన తీరుకే నా వ్యతిరేకత.. గద్దర్ బతికున్నప్పుడు మీరేం చేశారు?
తాను సామాజిక తెలంగాణ రావాలని ఆకాంక్షించిన వ్యక్తినే తప్ప తెలంగాణకు ఎన్నడూ వ్యతిరేకిని కాదన్నారు.
- పార్లమెంట్ విభజన తీరు: పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించిన తీరును మాత్రమే తాను తప్పుబట్టానని స్పష్టం చేశారు.
- నేతల తీరుపై విమర్శ: “నాడు వైఎస్సార్ తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పినా, ఈరోజు నన్ను విమర్శించేవాళ్లు ఆయనకు ఊడిగం చేశారు” అని దుయ్యబట్టారు.
- గద్దర్ ప్రస్తావన: దివంగత ప్రజా గాయకుడు గద్దర్ ప్రస్తావన తెస్తూ.. “గద్దర్ బతికున్న రోజుల్లో మీరంతా ఎక్కడ ఉన్నారు? ఆయన వచ్చి తనకు ఒక బండి (వాహనం) కొనివ్వాలని అడిగితే రెండు రోజుల్లో కొనిచ్చాను. ఆయన బతికి ఉన్న రోజుల్లో మీరేం చేశారు?” అని ప్రశ్నించారు.
ఇటీవల ఒక విశ్లేషకుడి వ్యాఖ్యల వల్ల మొదలైన వివాదంపై స్పందిస్తూ.. ఆ విశ్లేషకుడిపై కేసులు పెట్టిన విషయం మొదట్లో తనకు తెలియదని, విషయం తెలిసిన వెంటనే కేసులు వద్దు వదిలేయమని చెప్పానన్నారు. అయినప్పటికీ ప్రెస్‌క్లబ్‌లో మీటింగ్‌లు పెట్టి నన్ను తిట్టారని, తెలంగాణలో జరిగే ప్రతి సమస్యకూ ఆంధ్రా వారే కారణమన్నట్లు మాట్లాడటం సరికాదన్నారు.
కబ్జా నిరూపిస్తే ఆ భూమి తీసుకోండి: సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్
మర్రి చెన్నారెడ్డి చొరవ వల్లే సినీ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిందని, తెలుగు ప్రజలు 50 ఏళ్లు కలిసి ఉన్న ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని పవన్ అన్నారు. పాలకులు వేరని, ప్రజలు వేరని పేర్కొంటూ.. తప్పు చేస్తే పాలకులను తిట్టాలి తప్ప సామాన్య ప్రజలను కాదని హితవు పలికారు.
తనపై వస్తున్న చెరువుల ఆక్రమణ ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు:
“నేను చెరువును ఆక్రమించుకున్నానని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. నేను సీఎం రేవంత్‌రెడ్డి గారికి నేరుగా చెబుతున్నా.. ఒకవేళ నేను ఎక్కడైనా కబ్జా చేశానని నిరూపణ అయితే, నిరభ్యంతరంగా ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు.”
గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఏపీకి వచ్చినప్పుడు తానే స్వయంగా స్వాగతించానని, జనసేన మాజీ నేతలను బీఆర్ఎస్లోకి తీసుకున్నా తాను అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. కేవలం 2 వేల మందితో అంతర్గత సమావేశం పెట్టుకుంటామంటే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. ఇలాంటి ఏకపక్ష విశ్లేషకుల వల్లే దేశంలో కమ్యూనిజం చచ్చిపోయిందని విమర్శించారు.
తెలంగాణలో పోటీ చేస్తాం.. నేనే స్వయంగా తిరుగుతా!
తన తెలంగాణ పర్యటనలపై వస్తున్న ఊహాగానాలకు పవన్ కల్యాణ్ ఈ సమావేశంతో గట్టి క్లారిటీ ఇచ్చారు. “ఇప్పటి వరకు నేను ఒక నిర్ణయానికి రాలేదు. కానీ మీరు నన్ను రావద్దని బెదిరిస్తున్నారు కాబట్టే చెబుతున్నా.. తెలంగాణలో జనసేన ఖచ్చితంగా ఉంటుంది. మేము ఇక్కడ పోటీ చేస్తాం. అవసరమైతే తెలంగాణలో నేనే స్వయంగా తిరుగుతాను. ఇక్కడి ప్రతి సమస్య మీద మాట్లాడుతాం.. ప్రతి అన్యాయాన్ని ఎదిరిస్తాం. నా తెలంగాణ భారతదేశంలో ఒక అంతర్భాగం. మీ బెదిరింపులకు మేము భయపడము. గతంలో తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన వారే ఇప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో కూర్చున్నారు, ఎమ్మెల్యేలు అయ్యారు” అని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
