అదనంగా మరో రూ.200 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశం
న్యూఢిల్లీ:
బహుళ ప్రాచుర్యం పొందిన ‘వాన్‌పిక్’ (వాడరేవు, నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్) ప్రాజెక్టు పెట్టుబడుల వివాదంలో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (రాకియా)కు అనుకూలంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) న్యాయస్థానం ఇచ్చిన మనీ డిక్రీ అమలుకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి కమర్షియల్ కోర్టులు ఈ వ్యవహారంలో తుది తీర్పు వెలువరించేంతవరకు.. నిమ్మగడ్డ ప్రసాద్ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వద్ద రెండు వారాల్లోపు అదనంగా మరో రూ.200 కోట్ల మొత్తాన్ని పూచీకత్తుగా డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి కమర్షియల్ కోర్టులు తమ ఎదుట ఉన్న ప్రధాన ఎగ్జిక్యూషన్ పిటిషన్లు, ఇతర అనుబంధ దరఖాస్తులపై విచారణ పూర్తి చేసి నాలుగు నెలల్లోపు తుది నిర్ణయం వెలువరించాలని ధర్మాసనం నిర్దేశించింది.
యూఏఈ కోర్టు డిక్రీ – పూచీకత్తు లెక్కలు:
యూఏఈ కోర్టు 2022 ఫిబ్రవరిలో ఇచ్చిన డిక్రీ ప్రకారం.. రస్ అల్ ఖైమాకు నిమ్మగడ్డ ప్రసాద్ రూ.543.92 కోట్ల అసలుతో పాటు 2021 అక్టోబరు నుంచి 6% వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఆ మొత్తం విలువ దాదాపు రూ.949.96 కోట్లకు చేరింది.
- ప్రస్తుత పూచీకత్తులు: నిమ్మగడ్డ ప్రసాద్ ఇప్పటికే రూ.231.70 కోట్ల నగదుతో పాటు, తన కుమార్తె స్వాతి పేరిట ఉన్న భూమి పత్రాలను డిపాజిట్ చేశారు. ఆ భూమి విలువ రూ.400 కోట్లు ఉంటుందని ప్రసాద్ తరఫు న్యాయవాదులు పేర్కొనగా, రూ.150 కోట్లలోపే ఉంటుందని రాకియా వాదించింది. ధర్మాసనం మధ్యేమార్గంగా దాని విలువను రూ.250 కోట్లుగా పరిగణనలోకి తీసుకుంది.
- అటాచ్ చేసిన ఆస్తులు: వీటికి తోడు కమర్షియల్ కోర్టులు ఇప్పటికే రూ.212 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశాయి.
- అదనపు మొత్తం: విదేశీ డిక్రీ మొత్తం విలువకు సమానమైన భద్రత ఉండేందుకు ఈ ఆస్తులకు అదనంగా మరో రూ.200 కోట్లను డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కమర్షియల్ కోర్టులు తుది తీర్పు వెలువరించిన తర్వాతే ఈ పూచీకత్తుల స్వాధీనంపై తుది నిర్ణయం ఉంటుందని పేర్కొంది.
కార్పొరేట్ ముసుగును తొలగించే హక్కు కమర్షియల్ కోర్టులకే:
యూఏఈ కోర్టు ఇచ్చిన డిక్రీని తప్పించుకునేందుకు నిమ్మగడ్డ ప్రసాద్ తన ఆస్తులను ఇతర కార్పొరేట్ సంస్థల పేరిట దాచేందుకు ప్రయత్నిస్తున్నారన్న రాకియా వాదనల్లో ప్రాథమికంగా నిజం ఉన్నట్లు కనిపిస్తోందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే, డిక్రీ అమలు కోసం ప్రసాద్ కుటుంబసభ్యుల ఆధ్వర్యంలోని సంస్థలను పరిగణనలోకి తీసుకోవచ్చా లేదా, వాటి కార్పొరేట్ ముసుగును (Corporate Veil) తొలగించవచ్చా అనే అంశంపై కమర్షియల్ కోర్టుల ముందే ఇరుపక్షాలు వాదనలు వినిపించాలని ధర్మాసనం తెలిపింది. గతంలో హైకోర్టు, ఎన్సీఎల్టీ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అదే సమయంలో నిమ్మగడ్డ ప్రసాద్‌కు వ్యతిరేకంగా రాకియా దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది.
వివాద నేపథ్యం:
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో వాడరేవు, నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్‌పిక్) ప్రాజెక్టు కింద పోర్టులు, విమానాశ్రయం అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం యూఏఈకి చెందిన రస్ అల్ ఖైమా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం రాకియా భారీగా పెట్టుబడులు సమకూర్చింది. అయితే వైఎస్సార్ మరణానంతరం ఈ ప్రాజెక్టు అటకెక్కింది. తమ నిధులను ప్రసాద్ దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ రస్ అల్ ఖైమా యూఏఈ కోర్టును ఆశ్రయించగా, ప్రసాద్ వడ్డీతో సహా నిధులు తిరిగి చెల్లించాలని డిక్రీ ఇచ్చింది. ఆ విదేశీ డిక్రీని హైదరాబాద్, రంగారెడ్డి కమర్షియల్ కోర్టుల ద్వారా అమలు చేయాలని రాకియా ఎగ్జిక్యూషన్ పిటిషన్లు దాఖలు చేయడంతో వివాదం సుప్రీంకోర్టు వరకు చేరింది.
