డాసాల్ట్ భాగస్వామ్యం కోసం టాటా, మహీంద్రా, అదానీ మధ్య తీవ్ర పోటీ.. దేశ రక్షణ రంగంలో కీలక పరిణామం
భారతదేశంలో 92 Dassault Rafale యుద్ధ విమానాలను దేశీయంగా తయారు చేయాలన్న ప్రతిష్టాత్మక ప్రణాళిక దేశ రక్షణ రంగంలో భారీ పారిశ్రామిక పోటీకి దారితీస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన Dassault Aviation తో భాగస్వామ్యం కోసం Tata Advanced Systems Limited, Mahindra Aerospace, Adani Defence & Aerospace సంస్థలు ప్రధాన పోటీదారులుగా నిలుస్తున్నాయి. ఈ కార్యక్రమం భారత ఏరోస్పేస్ రంగ చరిత్రలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ రక్షణ భాగస్వామ్యాల్లో ఒకటిగా భావిస్తున్నారు.
ఈ ప్రతిపాదిత ఒప్పందంలో గణనీయమైన సాంకేతిక పరిజ్ఞాన బదిలీ (ToT) ఉండే అవకాశముందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల సుమారు 50-60 శాతం వరకు దేశీయీకరణ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ మూడు భారతీయ కంపెనీలు తమ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. ప్రభుత్వం వివరణాత్మక ఆడిట్లు నిర్వహించిన అనంతరం తుది ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది. అయితే చివరి నిర్ణయం డాసాల్ట్ ఏవియేషన్ చేతిలోనే ఉండనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేక జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో డాసాల్ట్ మెజారిటీ వాటా కలిగి ఉండగా, ఒకటి లేదా ఇద్దరు భారతీయ వ్యూహాత్మక భాగస్వాములు చేరే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఉన్న డాసాల్ట్-రిలయన్స్ ఏరోస్పేస్ నమూనాతో పోలిస్తే ఈసారి మరింత విస్తృత స్థాయి తయారీ వ్యవస్థ ఏర్పడనుందని సమాచారం.
ఈ పోటీలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ బలమైన ముందంజలో ఉన్నట్లు రక్షణ రంగ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే డాసాల్ట్తో కుదుర్చుకున్న నాలుగు ప్రధాన ఉత్పత్తి బదిలీ ఒప్పందాల ద్వారా రఫేల్ యుద్ధ విమానాల కీలక ఫ్యూజ్‌లేజ్ నిర్మాణ భాగాలను హైదరాబాద్ కేంద్రంలో తయారు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ తయారీ భారత వైమానిక దళ అవసరాలతో పాటు డాసాల్ట్ ప్రపంచ సరఫరా గొలుసుకు కూడా ఉపయోగపడనుంది. దీంతో భారత్ ప్రపంచ రఫేల్ ఉత్పత్తి వ్యవస్థలో కీలక భాగస్వామిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదేవిధంగా Airbus C295 సైనిక రవాణా విమాన ప్రాజెక్టులో టాటాకు వచ్చిన అనుభవం కూడా ఈ పోటీలో కీలక బలం అవుతోంది. ఎయిర్‌బస్‌తో కలిసి వడోదరలో ఏర్పాటు చేసిన ఫైనల్ అసెంబ్లీ లైన్ ద్వారా భారత ప్రైవేట్ రంగంలో పూర్తి స్థాయి సైనిక విమాన తయారీకి శ్రీకారం చుట్టిన తొలి సంస్థగా టాటా నిలిచింది. ఈ అనుభవం రఫేల్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాల తయారీలో విశ్వసనీయతను పెంచిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక మహీంద్రా, అదానీ సంస్థలు కూడా ఏరోస్పేస్ రంగంలో తమ విస్తరణను వేగవంతం చేస్తున్నాయి. దేశీయ రక్షణ తయారీ రంగంలో తమ స్థానం బలోపేతం చేసుకోవడానికి ఈ ప్రాజెక్టును కీలక అవకాశంగా చూస్తున్నట్లు సమాచారం.
రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ రఫేల్ తయారీ కార్యక్రమం విజయవంతమైతే భారత్‌లో అధునాతన యుద్ధవిమాన తయారీ సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయి. “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమానికి ఇది పెద్ద ఊతమివ్వడంతో పాటు, భవిష్యత్తులో రక్షణ ఎగుమతుల్లో కూడా భారత్‌కు కొత్త అవకాశాలు తెరవొచ్చని భావిస్తున్నారు.
