విశాఖపట్నం, జనవరి 25: ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటిపోయింది. ప్రభుత్వం పూర్తిగా కుదురుకున్నప్పటికీ, కూటమి పార్టీల్లో కీలకమైన తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో కింది స్థాయి క్యాడర్ ఇంకా గందరగోళంలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. స్థానికంగా బలంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలతో టీడీపీ క్యాడర్ సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశం టీడీపీ ముఖ్యనేతల్ని కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీలో ఉంటూ వైసీపీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తున్న క్యాడర్‌పై చింతకాయల విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, సొంత క్యాడర్ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. “వైసీపీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తే పేగులు తీసి రోడ్డు మీద పడేస్తాను” అంటూ వారిని హెచ్చరించారు. వైసీపీ నాయకులతో మాట్లాడినా, శుభకార్యాలకు వెళ్లినా ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.”సిగ్గులేకుండా కొంతమంది టీడీపీ కార్యకర్తలు వైసీపీ వాళ్లతో మాట్లాడుతున్నారు” అని చింతకాయల విజయ్ వ్యాఖ్యానించారు. అలాంటి వారి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. వారిపై సరైన సమయంలో చర్యలు తీసుకుంటామన్నారు. “సిగ్గు, లజ్జ, మానవత్వం ఉంటే వైసీపీ వాళ్లతో మాట్లాడకూడదు” అంటూ టీడీపీ క్యాడర్‌ను హెచ్చరించారు. “అటువంటి వాళ్లను ఒంగోపెట్టి తన్నేస్తాను” అంటూ ఆయన తీవ్రంగా స్పందించారు.ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. టీడీపీలో అంతర్గత ఐక్యతను బలోపేతం చేయడానికి ఈ హెచ్చరికలు ఉపయోగపడతాయా లేదా మరిన్ని వివాదాలకు దారితీస్తాయా అనేది చూడాలి. కూటమి ప్రభుత్వంలో టీడీపీ కీలక భూమిక పోషిస్తున్న నేపథ్యంలో, పార్టీలోని క్యాడర్ ఐక్యత మరింత ముఖ్యమవుతోంది.
