ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వివేకానందరెడ్డి హత్య కేసు చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య సందర్భంలో పులివెందుల సీఐగా పనిచేసిన జె. శంకరయ్య, ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లీగల్ నోటీసులు పంపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చంద్రబాబు దురుద్దేశపూర్వక ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ, అసెంబ్లీ వేదికగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఈ ఆరోపణల వల్ల తనకు జరిగిన అవమానానికి రూ. 1.45 కోట్ల పరిహారం చెల్లించాలని నోటీసులో స్పష్టం చేశారు.
అసలు ఏమి జరిగింది..?
2019 మార్చి 8న కడప జిల్లా పులివెందులలో మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ సమయంలో పులివెందుల సీఐగా జె. శంకరయ్య విధులు నిర్వహిస్తున్నారు. హత్యా ఘటన తెలిసిన వెంటనే శంకరయ్య స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పలుమార్లు శంకరయ్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. “శంకరయ్య సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారు. రక్తపు మరకలు కూడా కడిగేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేశారు” అంటూ అసెంబ్లీలో, మీడియా సమావేశాల్లో చంద్రబాబు ఈ ఆరోపణలు పలుమార్లు చేసారు
ఈ ఆరోపణలు తీవ్రతరం కావడంతో, 2019లోనే టీడీపీ ప్రభుత్వం శంకరయ్యను సస్పెండ్ చేసింది. ఈ సంఘటన శంకరయ్య వృత్తి జీవితంలో తీవ్రంగా ప్రభావం చూపింది. అయితే, 2021 అక్టోబర్ 6న వైసీపీ ప్రభుత్వం ఈ సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. ప్రస్తుతం శంకరయ్య కర్నూల్ రేంజ్లో వీఆర్‌లో ఉన్నారు.
బెదిరింపులు, వాంగ్మూలాలు.. కేసు మలుపు
వివేకా హత్యపై కేసు నమోదు చేయక్కర్లేదంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనను బెదిరించారని శంకరయ్య సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. “డెడ్‌బాడీని పోస్ట్‌మార్టమ్‌కు పంపించొద్దు. మృతదేహంపై గాయాలు ఉన్నాయని ఎవరికీ చెప్పొద్దు” అంటూ తనను భయపెట్టారని ఆయన తెలిపారు. మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం నమోదు చేయడానికి రాకుండా “వేరే పనులు ఉన్నాయి” అని తప్పించుకున్నారని కూడా శంకరయ్య పేర్కొన్నారు.
కానీ, సీబీఐ దర్యాప్తులో ఈ విషయం మలుపు తిరిగింది. “నిందితుల ప్రభావంతో శంకరయ్య మాట మార్చారు” అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో శంకరయ్య తన వైరుధ్యాన్ని చూపడానికి చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీసింది. ఈ నోటీసులు ఈ నెల 18న న్యాయవాది జి. ధరణేశ్వరరెడ్డి ద్వారా పంపబడ్డాయి.
రాజకీయ ప్రతిచర్చలు
వివేకా హత్య కేసు ఎప్పటికీ రాజకీయ ఆయుధంగా మారుతూనే ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసు సీటీ ద్వారా దర్యాప్తు చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం సమయంలో కేసు సీబీఐ చేతిలోకి వచ్చి, సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ స్పెషల్ కోర్టుకు బదిలీ అయింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులు, సాక్షులు బెదిరింపులు ఎదుర్కొన్నారని ఆరోపణలు ఉన్నాయి
