వాషింగ్టన్, సెప్టెంబర్ 23: అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన 90 అడుగుల హనుమాన్ విగ్రహం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన , టెక్సాస్ రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి అలెగ్జాండర్ డంకన్ (34) తీవ్ర వివాదాన్ని రేపారు. హిందూ సంఘాలు, నెటిజన్లు ఆయన వ్యాఖ్యలను ‘హిందూ వ్యతిరేక, రెచ్చగొట్టే వ్యాక్యలని విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు అమెరికాలో మత స్వేచ్ఛని ప్రశ్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తమవుతోంది.
షుగర్ ల్యాండ్‌లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ఇటీవల ఆవిష్కరించిన ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ అనే 90 అడుగుల హనుమాన్ విగ్రహం వీడియోను డంకన్ X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. “టెక్సాస్‌లో హిందూ దేవుడి తప్పుడు విగ్రహాన్ని ఎందుకు అనుమతిస్తున్నాం? మనం క్రైస్తవ దేశం” అని రాశారు. అమెరికా క్రైస్తవ విలువలపై స్థాపించబడిందని, ఇతర మతాల విగ్రహాలను అనుమతించకూడదని ఆయన వాదించారు.
హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. “హిందూ మతాన్ని, అమెరికా హిందువులను అవమానించే వ్యాఖ్యలు” అని HAF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుహాగ్ శుక్లా చెప్పారు. టెక్సాస్ రిపబ్లికన్ పార్టీ (GOP)కు ఫిర్యాదు చేసి, డంకన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో మాగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) అనుచరులు ఈ విగ్రహాన్ని ఇడాల్గా విమర్శిస్తున్నారు.
ఈ విగ్రహం ఉత్తర అమెరికాలో అతి పెద్ద హనుమాన్ విగ్రహం, ఇది ఐక్యత, భక్తి సందేశాన్ని సూచిస్తుంది. హిందువులు అమెరికాలో అత్యంత విద్యావంతులు, ఆర్థికంగా విజయవంతమైన సమూహాల్లో ఒకటి, 77% మంది కాలేజీ డిగ్రీలు కలిగి ఉన్నారు, 36% మంది వార్షిక ఆదాయం $200,000 పైన ఉంది అని వన్ఇండియా నివేదిక తెలిపింది. డంకన్ వ్యాఖ్యలు అమెరికా మత స్వేచ్ఛ ని పరీక్షిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
సోషల్ మీడియాలో డంకన్‌ను విమర్శిస్తూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఒక యూజర్ “వేదాలు జీసస్ జన్మకు 2000 సంవత్సరాల ముందు రాయబడ్డాయి” అని గుర్తుచేశారు. రిపబ్లికన్ పార్టీ ఇంకా ఈ వివాదంపై స్పందించలేదు.
