బెల్గాంలో 1979 చాతుర్మాస్యం ముగిసిన మరుసటి రోజు ద్వాదశి కావడంతో పారణకు, పరమాచార్య స్వామివారి భిక్షకు ఇంట్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెల్లవారుఝాము నాలుగున్నర అప్పుడు మందిరంలో శ్రీ ఏకాంబరం పంచాగం చదివి చెబుతూ చివర్లో, “యతి మహాలయం” అని ముగించారు.
పదిన్నర సమయంలో శ్రీ రాజగోపాల్ (మెట్టూర్ స్వామిగళ్) ఇంటికి వచ్చి, యతి మహాలయ ద్వాదశి రోజు ఎక్కడో సంచరిస్తూ సిద్ధిపొందిన సన్యాసుల ఆరాధన చెయ్యడం చాలా ముఖ్యమని, ఈ సంవత్సరం ఈ ఇంట్లో జరగాలని, పరమాచార్య స్వామివారి ఆజ్ఞ మేరకు ఆరాధనని దార్వార్ శ్రీ బాలచంద్ర ఘనాపాటి, తిరువణ్ణామలై శ్రీ రాము వాధ్యర్ చేయిస్తారని తెలిపారు. దాదాపు ఎనభై మందికి భోజనం పెట్టాలి కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోమని తెలిపారు. పరమాచార్య స్వామివారు తెలిపిన ప్రకారం, ఈ ఆరాధన సిద్ధి పొందిన సన్యాసులందరినీ ఉద్దేశించి చేసేది. ఇప్పటిదాకా ఆరాధన జరగనివారికి కూడా ఎందుకంటే ఇది “సన్యస్థ మహాలయం”. ఈ ఇంటిలోనే చెయ్యాలని మహాస్వామివారి కోరిక.
ఇది వినగానే మాకు ఆశ్చర్యము, ఆందోళన రెండూ కలిగాయి. బెల్గాం ఇక్కడకు పదిహేడు కిలోమీటర్ల దూరం కావడంతో పూజకు కావాల్సిన ఏర్పాట్లు చెయ్యడానికి సమయం పడుతుంది. కాని, ఆరాధన పన్నెండున్నర కల్లా మొదలవ్వాలని ఆదేశం. ఫోను ద్వారా బెల్గాంలో ఉన్న స్నేహితులకు విషయం తెలియజేయడంతో, ఆరాధనకు కావాల్సిన సంభారాలతో సాంబ్ర చేరుకున్నారు. పరమాచార్య స్వామివారి ఆదేశం ప్రకారం ఉగార్ స్వామి సమక్షంలో ఆరాధన మొదలయ్యింది.
కోయంబత్తూరు నుండి ఒక పెద్ద మిల్లు యజమాని తన తల్లితో సహా స్వామి వారి దర్శనానికి వచ్చాడు. ఆమె వయస్సు రిత్యా కారునుండి కిందకు దిగలేకపోవడంతో పరమాచార్య స్వామివారే కారు వద్దకు వెళ్లి దర్శనం ఇచ్చారు. అతను తనవెంట తెచ్చిన ఆరు జతల ధోవతులు మహాస్వామి వారికివ్వగా, వాటిని బ్రాహ్మణులకిమ్మని ఇంటికి పంపారు స్వామివారు.
మూడు గంటల పదిహేను నిముషాలకు మొత్తం కార్యక్రమం అయిపొయింది. నలుగురు బ్రాహ్మణులు (ఒకరు ఆదిశంకర స్వరూపులు) భోజనాదులు కూడా ముగించారు. ఇప్పుడే ఒక మహాత్తరమైన సంఘటన జరిగింది.
మా కార్యాలయంలో పనిచేసే ఒకతను పరుగుపరుగున ఇంటికి వచ్చి, పరమాచార్య స్వామివారు ఇంటివైపు వస్తున్నారని తెలియజేశాడు. దర్భాసనం, గొడుగుతో బాలు, ఏకాంబరం ఇతరులు వెంటరాగా సరిగ్గా మూడున్నరకు పరమాచార్య స్వామివారు ద్వారం ముందర ఉన్నారు. మా కళ్ళను మేమే నమ్మలేకున్నాము.
ఎలాగో ఒక పూర్ణకుంభాన్ని త్వరగా సిద్ధం చేసి, వంటింటి బాధ్యత తీసుకున్న శ్రీకంఠన్ పరమాచార్య స్వామివారికి అందించాడు. పరమాచార్య స్వామివారు ఇంటిలోకి రాగానే, పూజగది ఎక్కడని అడిగి వెళ్లి కొద్దిసేపు కూర్చుని జపం చేశారు. వెంటనే ఆరాధన జరిగిన హాలులోకి వచ్చి, తీర్థ కుంభానికి శిరస్సు వంచి నమస్కారం చేశారు. తరువాత వంటగదిలోనికి వెళ్లి, బ్రాహ్మణులకు సిద్ధం చేసిన వంటకాలను చూపమని శ్రీకంఠన్ ను అడిగారు. మరలా పూజగదిలోకి వెళ్లి, ఆరాధన కోసం వండిన వంటకాలను అన్నంతో సహా తీసుకునిరమ్మని శ్రీకంఠన్ ను ఆదేశించారు. ఎంతటి అద్భుతమైన సన్నివేశం!
సాయంత్రం అయిదు గంటలదాకా మహాస్వామివారు ఇంటిలోనే ఉన్నారు. శ్రీ ఉగార్ స్వామి ఉపన్యాసం విని, ఎయిర్పోర్ట్ దేవాలయానికి ప్రయాణమయ్యారు. వెళ్ళేటప్పుడు గొడుగు, దర్భాసనం, పీట, శాలువా పూజగదిలోనే వదిలేసారు. తరువాత వాటిని తిరిగివ్వాలని ప్రయత్నించినప్పుడు ఆ గృహస్థుడి ఇంటిలోనే ఉంచమని, ప్రతి సన్యాస మహాలయం రోజు ఒక వేద బ్రాహ్మణున్ని ఆదిశంకరులుగా భావించి, భోజనం పెట్టి తాంబూల దక్షిణలు సమర్పించి గౌరవించమని ఆదేశించారు. స్వామివారి అనుగ్రహం వల్ల ఇది ఇప్పటికి జరుగుతూనే ఉంది.
ఆరోజు రాత్రి స్వామివారు దత్తాత్రేయ ప్రతిష్ట కోసం సిద్ధం చేస్తున్న ఆలయంలో కూర్చుని, వచ్చిన భక్తులకు దతాత్రేయ అవతార ఉద్దేశ్యం వివరించారు. మేమందరం సాక్షాత్తు గురు దత్తాత్రేయులనే దర్శించుకున్నాము. నవరాత్రికి కూడా స్వామివారు ఇక్కడే ఉంటారన్న నిశ్చయానికి వచ్చేశాము.
కాని అనుకున్నవన్నీ జరగవు కదా! మరుసటిరోజు, 18 ఆగస్ట్ 1979న ఉదయం ఆరు గంటలప్పుడు స్వామివారు దేవాలయం నుండి బయలుదేరి తూర్పు వైపుగా ప్రయాణమయ్యారు. ఎప్పటిలాగే సేవకులందరూ పరుగుపరుగున స్వామివారిని అనుసరించి వెళ్ళిపోయారు.
మహాస్వామివారు ఘాట్ మార్గంగుండా పన్నెండు కిలోమీటర్లు నడిచి వెళ్లి, కరడి గుడ్డి అనే ప్రాంతాన్ని చేరుకున్నారు. అక్కడ చుట్టూ కొండల నడుమ, చిన్న నీటి ప్రవాహం వద్ద ఉన్న జంబు లింగ మందిర్ అను ఒక పాడుబడిన శివాలయంలో బస చేశారు. ఆరోజు ప్రదోషం కావడంతో, సాయంత్రం పూజ, అభిషేకము చేయాలని అనుకున్నారు.
బాలు మరియు ఇతరులు అభిషేకం చేస్తుండగా, మహాస్వామివారు గట్టిగా రుద్రం చదవడం మేము విన్నాము. చూస్తోంటే చాకాలం పాటు ఆ ఆలయంలో అభిషేకము, పూజ జరిగినట్టు లేదు. దాని తరువాతనే ఈ అద్భుతం జరిగింది. ఉదయం నుండి ఆకాశం నిర్మలంగా ఉండి, ఎటువంటి వర్ష సూచన లేదు. కాని అభిషేకం ముగిసిన వెంటనే, ఆకాశం మొత్తం మేఘావృతమై వర్షం మొదలైంది. పరమాచార్య స్వామివారు కూర్చున్న దేవాలయం మరియు రోడ్డును వేరుచేస్తూ ప్రవహిస్తున్న నీటిప్రవాహం ఉధృతమైంది. మేము చాలామందిమి రోడ్డు మీదనే ఉన్నాము. ప్రవాహం అటువైపునుండి ఆ చీకటిలో శ్రీకంఠన్ అరుపు వినబడింది. అక్కడున్న వారినందరినీ ముఖ్యంగా ఆడవారిని నా కారులో ఇంటికి తీసుకుని వెళ్లాల్సిందిగా పరమాచార్య స్వామివారి ఆదేశం. అంత పెద్ద వర్షం పడుతుండగా, ఆ చీకట్లో ఘాటురోడ్డులో పన్నెండు కిలోమీటర్ల ప్రయాణం క్షేమకరం కాకపోయినా, ఆజ్ఞ వచ్చినది నడిచే దేవుని నుండి కాబట్టి, ఇక ఏమి ఆలోచించకుండా పన్నెండుమందిని ఎక్కించుకుని, ఇతర వస్తువులతో పరమాచార్య స్వామి నామం చెప్పుకుంటూ కారులో వెళ్ళిపోయాను. సరిగ్గా ఇంటి గేటు ముందరకు రాగానే కారు ఆగిపోయింది.
మరుసటిరోజు ఉదయం కారు మెకానిక్ బానేట్ తెరవగానే, కార్బురేటర్ మొత్తం నీటితో నిండిపోయింది. అసలు కారు ఇక్కడిదాకా ఎలా వచ్చింది అని అతను ఆశ్చర్యపోయాడు. అప్పుడు పరమాచార్య స్వామివారి కరుణను గుర్తు తెచ్చుకున్నాము.
ఆరోజు రాత్రి అందరమూ మునుపటి యతి మహాలయ ప్రసాదాన్ని స్వీకరించాము. స్వామివారి దృష్టి తగిలినందువల్ల అది సమృద్ధిగా ఉంది. దాదాపు ఎనభై మంది తిన్నా అది ఖాళీ అవ్వలేదు. ఇది నిజంగా అద్భుతమే!
— సాంబ్ర కృష్ణమూర్తి. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
