గన్నవరం: గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం మండలాల్లోని చెరువులు, వాగులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రాసిన లేఖకు స్పందించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విచారణ కమిటీని నియమించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములపై జరుగుతున్న ఆక్రమణల వివరాలను సేకరించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆక్రమణలో ఉన్న భూములను గుర్తించి వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కూడా స్పందిస్తూ, “ప్రభుత్వ ఆస్తులను రక్షించడం అందరి బాధ్యత. ఆక్రమణలో ఉన్న భూములను విడిపించి ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలి” అని అభిప్రాయపడ్డారు.
