అమరావతి:
వైకాపా హయాంలో వెలుగుచూసిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టులో రెండో అనుబంధ అభియోగపత్రంను అధికారులు దాఖలు చేశారు.
తాజా అభియోగపత్రంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి (ఏ-38), అతని మిత్రుడు సీహెచ్ వెంకటేశ్నాయుడు (ఏ-34), ప్రధాన అనుచరుడు ఎం. బాలాజీ కుమార్ యాదవ్ (ఏ-35), వ్యక్తిగత సహాయకుడు ఈ. నవీన్ కృష్ణల (ఏ-36) ప్రమేయంపై పూర్తి వివరాలు పొందుపరిచారు.
దర్యాప్తులో వెలుగుచూసిన కీలక అంశాలు, వీరి పాత్ర, లావాదేవీల వివరాలను ఈ అభియోగపత్రంలో పొందుపరిచినట్లు సమాచారం.
ఇప్పటివరకు మద్యం కేసులో ప్రాథమిక అభియోగపత్రం సహా మొత్తం మూడు ఛార్జ్షీట్లు కోర్టులో దాఖలు చేయబడ్డాయి. ఈ పరిణామాలతో మద్యం కుంభకోణంపై దర్యాప్తు వేగం మరింత పెరిగే అవకాశం ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
