తిరుపతి, సెప్టెంబర్ 14, 2025: రెండు రోజులపాటు జరగనున్న మహిళా సాధికారతా జాతీయ సమ్మేళనం ఈరోజు తిరుపతిలో ప్రారంభమైంది. ఈ సమ్మేళనం పార్లమెంటరీ మరియు రాష్ట్ర చట్టసభల మహిళా సాధికారతా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 100 మందకు పైగా మహిళా ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమ్మేళనంలో పాల్గొంటున్నారు.లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్, పార్లమెంటరీ మహిళా సాధికారతా కమిటీ చైర్మన్ డి. పురందేశ్వరి, రాష్ట్ర చట్టసభ స్పీకర్ శ్రీ అయ్యన్నపాత్రుడు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సమ్మేళనంలో ‘మహిళల నేతృత్వంతో వికసిత భారత్’, ‘లింగ స్పందన బడ్జెటింగ్’ వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటి రోజు కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. అయితే, ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు, తిరుపతి మార్గంలో దట్టమైన మేఘాలు కారణంగా ఆయన పర్యటన రద్దయింది. ముఖ్యమంత్రి కార్యాలయం జారీ చేసిన ప్రకటన ప్రకారం, ఏవియేషన్ అధికారులు ప్రయాణానికి క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకోనున్నారని ముందుగా ప్రకటించబడినప్పటికీ, వాతావరణ అననుకూలంగా ఉండటంతో కార్యక్రమం రద్దు చేశారు.సమ్మేళనం రెండో రోజు (సెప్టెంబర్ 15) ముగింపు కార్యక్రమానికి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సమ్మేళనం మహిళల సాధికారతపై జాతీయ స్థాయిలో చర్చలకు దారితీస్తుందని, సాంకేతికతల యుగంలో మహిళలకు అవకాశాలు పెంచడంపై దృష్టి సారించినట్లు నిర్వాహుకులు తెలిపారు. తిరుపతి పంచరత్న ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.
