గిల్గిట్-బాల్టిస్తాన్: పాక్ ఆక్రమిత గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈ దుర్ఘటనలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఐదుగురు సిబ్బంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన వారిలో ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు.
పాకిస్తాన్ సైన్యానికి చెందిన మీడియా విభాగం ఐఎస్పిఆర్ (Inter-Services Public Relations) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, గిల్గిట్-బాల్టిస్తాన్లోని ఆల్పోరి ప్రాంతానికి సమీపంలో గల మినిమార్గ్లో ఈ ప్రమాదం సంభవించింది. ఆపరేషన్లో ఉన్న ఈ ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా కూలిపోయినట్లు ప్రాధమిక దర్యాప్తులో తేలింది.
ఈ దుర్ఘటనలో మరణించిన వారిలో కీరో సైనికులైన కెప్టెన్ సైద్ సికిందర్, కెప్టెన్ సయ్యద్ అతీఫ్ అనే ఇద్దరు పైలట్లు ఉన్నారు. మిగిలిన ముగ్గురు సైనికులు – హవల్దార్ సలీం, నాయిక్ ఇక్రమ్, నాయిక్ నౌమాన్ – కూడా మరణించినట్లు ఐఎస్పిఆర్ వెల్లడించింది. ప్రమాద సమయంలో, హెలికాప్టర్ ఒక సైనికుడి మృతదేహాన్ని గిల్గిట్ నుండి స్కర్దూలోని సైనిక ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటన పట్ల పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ ఉన్నతాధికారులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంపై తక్షణమే దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించడానికి కారణాలను లోతుగా పరిశీలిస్తామని వారు పేర్కొన్నారు.
