పెట్టుబడులు రెట్టింపు, 10 ట్రిలియన్ యెన్‌కు పెంపు
న్యూఢిల్లీ: అమెరికా పరిపాలన భారత ఆర్థిక వ్యవస్థపై సుంకాలు విధించి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానిని “చనిపోయిన ఆర్థిక వ్యవస్థ” అని అభివర్ణించిన వేళ, జపాన్ భారత్ పట్ల తన అచంచలమైన విశ్వాసాన్ని చాటుకుంది. భారత్‌లో తన పెట్టుబడి లక్ష్యాన్ని 5 ట్రిలియన్ యెన్ (సుమారు 34 బిలియన్ డాలర్లు) నుండి ఏకంగా 10 ట్రిలియన్ యెన్ (సుమారు 68 బిలియన్ డాలర్లు)కి పెంచింది. ఇది న్యూఢిల్లీకి “ఓట్ అఫ్ కాంఫిడెన్స్ “గా పరిగణించబడుతోంది.
రెండు రోజుల జపాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ, శనివారం జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి బుల్లెట్ రైలు ప్రయాణం చేస్తూ తన పర్యటనను ముగించారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య బలమైన ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలకు మరింత బలాన్ని చేకూర్చింది.
అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి, వాణిజ్య యుద్ధాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ భారీ పెట్టుబడి పెంపు భారత్‌కు ఒక గొప్ప సానుకూల పరిణామంగా నిలుస్తుంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు భారత ఆర్థిక స్థితిపై ప్రశ్నలు లేవనెత్తిన వేళ, జపాన్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్ అభివృద్ధి సామర్థ్యంపై దృఢమైన నమ్మకాన్ని సూచిస్తుంది. ఈ పెట్టుబడులు భారతదేశంలో మౌలిక సదుపాయాలు, తయారీ, డిజిటల్ రంగాలలో గణనీయమైన వృద్ధికి తోడ్పడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రధాని మోడీ జపాన్ పర్యటనలో ఇరు దేశాల ప్రధానుల మధ్య చర్చలు, పలు దైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. జపాన్‌తో భారతదేశం యొక్క వ్యూహాత్మక భాగస్వామ్యం, కేవలం ఆర్థిక సహకారానికే కాకుండా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడానికి కూడా కీలకమైనదని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. బుల్లెట్ రైలులో ప్రధానుల ప్రయాణం, ఇరు దేశాల మధ్య పటిష్టమైన మైత్రికి మరియు భవిష్యత్ సహకారానికి ప్రతీకగా నిలిచింది.
