న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ షాకిచ్చింది. 20 ఏళ్లకు పైబడిన పాత వాహనాలను దేశంలో ఎక్కడైనా నడుపుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూనే, వాటి రిజిస్ట్రేషన్ రెన్యూవల్ రుసుములను గతంలో కంటే రెట్టింపు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఈ కొత్త నిబంధనలు త్వరలో దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. పాత వాహనాలను ఇకపై రోడ్లపై నడిపించవచ్చని వెల్లడిస్తూనే, వాటి నిర్వహణ ఖర్చులను పెంచేలా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఈ నిర్ణయంతో లక్షలాది మంది వాహనదారులపై ఆర్థిక భారం పడనుంది. పాత వాహనాలను కొనసాగించాలనుకునే వారు రెట్టింపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది పాత వాహనాలను వదిలించుకోవడానికి లేదా కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రజలను ప్రోత్సహిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
