శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి డిసెంబర్ 24, 2025 బుధవారం ఉదయం చేపట్టిన బాహుబలి రాకెట్ ‘ఎల్వీఎం3-ఎం6’ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంతో అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం ‘బ్లూబర్డ్ బ్లాక్-2’ను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.ఈ ఉపగ్రహం బరువు సుమారు 6,100 కిలోలు. ఇంత భారీ ఉపగ్రహాన్ని భారత భూమి నుంచి ప్రయోగించడం ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ ఉపగ్రహం ప్రపంచవ్యాప్తంగా సాధారణ స్మార్ట్ఫోన్లకు నేరుగా 4జీ, 5జీ కనెక్టివిటీ అందించే సాంకేతికతను కలిగి ఉంది.తొలుత ఉదయం 8:54 గంటలకు ప్రయోగాన్ని షెడ్యూల్ చేశారు. సాంకేతిక కారణాలతో కొద్ది సెకన్ల వాయిదా పడింది. ఉదయం 8:55:30 గంటలకు 43.5 మీటర్ల పొడవు, 640 టన్నుల బరువున్న ఎల్వీఎం3-ఎం6 రాకెట్ నిప్పులు కక్కుతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. సుమారు 15 నిమిషాల ప్రయాణంలో 520 కిలోమీటర్ల ఎత్తులో లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)లో ఉపగ్రహాన్ని విజయవంతంగా విడుదల చేసింది.ఈ ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ మాట్లాడుతూ, “బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శాస్త్రవేత్తలందరికీ అభినందనలు. ఎల్వీఎం3 ప్రయోగాల్లో 100 శాతం విజయాలు సాధిస్తున్నాం. అతి తక్కువ సమయంలో (కేవలం 52 రోజుల్లో) మరో ఎల్వీఎం3 ప్రయోగం చేపట్టడం గొప్ప విజయం. భారత భూమి నుంచి పైకెగసిన అతి భారీ ఉపగ్రహం ఇదే. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటి. గగన్‌యాన్ మిషన్‌కు ఈ విజయం మరింత ఆత్మవిశ్వాసం కలిగిస్తోంది” అని అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. “భారత యువత శక్తితో అంతరిక్ష కార్యక్రమం మరింత ప్రభావవంతమవుతోంది. ఎల్వీఎం3 విశ్వసనీయతతో ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో అడుగు పడింది. గగన్‌యాన్ వంటి భవిష్యత్ మిషన్లకు బలమైన పునాది పడింది” అని ట్వీట్ చేశారు.ఈ విజయంతో ఇస్రో వాణిజ్య ప్రయోగాల్లో మరింత బలోపేతమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఉపగ్రహాల ప్రయోగాలకు భారత్ నమ్మకమైన ఎంపికగా మారుతోంది.
