సిడ్నీ వేదికగా మూడో వన్డేలో ఆస్ట్రేలియా, టీమ్ ఇండియా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారతజట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ తొలుత 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా ఈ లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. బ్యాటింగ్‌లో భారత్‌కు శుభారంభం దక్కింది. రోహిత్ శర్మ (121*; 125 బంతుల్లో, 13 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (74*; 81 బంతుల్లో, 7 ఫోర్లు) అద్భుతంగా రాణించారు.తొలుత శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ మొదటి వికెట్‌కు 69 పరుగులు జత చేశారు. 24 పరుగుల వద్ద గిల్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ తొలి బంతికే తన పరుగుల ఖాతా తెరిచాడు. మొదటి రెండు వన్డేల్లో వరుసగా డకౌట్ అయిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో మాత్రం తన రిథమ్‌లోకి వచ్చాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. రో- కో ధాటికి ఆసీస్ బౌలర్లు తేలిపోయారు. వీరు మూడో వికెట్‌కు 169 బంతుల్లో 168* పరుగులు జత చేశారు. రెండో మ్యాచ్‌లో అర్ధ శతకం చేసిన రోహిత్ ఈ వన్డేలోనూ అద్భుతంగా రాణించి, సెంచరీ (105 బంతుల్లో) చేశాడు. రోహిత్ శర్మకు ఓవరాల్‌గా ఇది 50వ సెంచరీ. వన్డేల్లో అతడికిది 33వ శతకం. ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ ఆ జట్టుపై ఎక్కువ సెంచరీలు (6) చేసింది కూడా రోహిత్ శర్మనే. ఆ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ (5 సెంచరీలు) ఉన్నాడు.మొదటి రెండు వన్డేల్లో విఫలమైన కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. 56 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే ఓ అరుదైన రికార్డునూ సాధించాడు. విరాట్ కోహ్లీ వన్డేల్లో రెండో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఇంతకు ముందు మూడోస్థానంలో ఉన్న అతడు.. ఈ మ్యాచ్‌లో కుమార సంగక్కరను (14234 పరుగులు) అధిగమించాడు. కోహ్లీ కంటే ముందు 18426 పరుగులతో సచిన్ తెందూల్కర్ ఉన్నాడు.ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ మాత్రమే ఒక వికెట్ పడగొట్టాడు. మిగతా బౌలర్లంతా తేలిపోయారు. అంతకు ముందు ఆసీస్ బ్యాటర్లలో మ్యాట్ రెన్షా (56), మిచెల్ మార్ష్ (41) రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో హర్షిత్ రాణా 4, సుందర్ 2.. సిరాజ్, కుల్దీప్, అక్షర్, ప్రసిద్ధ్‌కృష్ణ తలో వికెట్ తీశారు.
