చిలకలపూడి: వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసు నమోదు చేశారు. ఆర్.పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేశారని చిలకలపూడి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. వైకాపా నేత సుబ్బన్నను శుక్రవారం విచారణ కోసం మచిలీపట్నం టౌన్ పీఎస్కు పిలిచారు. ఈక్రమంలో అక్కడికి వెళ్లిన పేర్ని నాని సీఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు హల్చల్ చేశారు. ఈ ఘటనను ఎస్పీ తీవ్రంగా పరిగణించారు.
పేర్ని నాని ఆధ్వర్యంలో వైకాపా నేతలు మెడికల్ కళాశాల వద్ద ఇటీవల నిరసన చేపట్టారు. కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని, నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వినలేదు. వాగ్వాదానికి దిగి లాఠీలు లాక్కున్నారు. ఈ ఘటనలో 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి 41ఏ నోటీసులు ఇచ్చారు. ఠాణాకు విచారణకు రావాలని పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. తాము చెప్పేవరకూ పోలీసుల వద్దకు ఎవరూ వెళ్లొద్దంటూ వైకాపా నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. దీంతో సుబ్బన్నను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి పేర్ని నాని పెద్ద సంఖ్యలో వైకాపా కార్యకర్తలతో కలిసి మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. నేరుగా సీఐ గదిలోకి వెళ్లి బెదిరింపులకు దిగారు. పలువురు వైకాపా నేతలు కూడా పోలీసులను అవహేళన చేస్తూ మాట్లాడారు. అలా మాట్లాడం సరికాదంటూ సీఐ ఏసుబాసు అనడంతో పేర్నినాని రెచ్చిపోయారు. ఆయనకు వేలు చూపిస్తూ.. మావాళ్లనే తీసుకొస్తావా.. అంటూ రెచ్చిపోయి బెదిరింపులకు దిగారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
