30 నిమిషాలు పాటు వెయిటింగ్
వాషింగ్టన్, సెప్టెంబర్ 25, 2025: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్, సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్‌లతో వైట్ హౌస్‌లో ఓవల్ ఆఫీస్‌లో చర్చలు నిర్వహించారు. ఈ సమావేశం రెండు దేశాల మధ్య మెరుగయ్యే సంబంధాలకు ఒక సూచనగా కనిపిస్తోంది. అయితే, పాకిస్తాన్ నాయకులు ట్రంప్‌ను కలవడానికి సుమారు 30 నిమిషాలు ఎదురుచూస్తూ ఉండాల్సి వచ్చిందని పాక్ ప్రధాని కార్యాలయం నివేదించింది.
పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ సుమారు 4:52 గంటలకు వైట్ హౌస్‌కు చేరుకున్నారు. వారిని అమెరికా అధికారులు స్వాగతించారు. అసీం మునీర్ కూడా షరీఫ్‌తో కలిసి వచ్చారు. ట్రంప్ అప్పటికే కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేస్తూ, జర్నలిస్టులతో మాట్లాడుతున్నారు. ఈ కారణంగా సమావేశం 30 నిమిషాలు ఆలస్యమైందని, ANI వార్తా సంస్థ నివేదించింది. వైట్ హౌస్ ప్రెస్ పూల్ ఫోటోల్లో కూడా షరీఫ్, మునీర్ ఓవల్ ఆఫీస్‌లో ఎదురుచూస్తూ కనిపించారు.
సమావేశం సుమారు 20 నిమిషాలు సాగినట్టు తెలుస్తోంది. ఇందులో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడ్ వాన్స్, స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో కూడా పాల్గొన్నారు. మీడియాకు అనుమతిలేని సమావేశంలో వాణిజ్యం, ఆర్థిక అభివృద్ధి, క్రిప్టోకరెన్సీ వంటి అంశాలు చర్చకు వచ్చాయని అధికారిక సమాచారం.
ఈ సమావేశం జూన్‌లో ట్రంప్, మునీర్ మధ్య జరిగిన భోజన సమావేశానికి తరువాత ఇంకో సమావేశం జరగడం రెండోసారి . జూలైలో రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత ఈ సంబంధాలు మెరుగుపడ్డాయి. ట్రంప్, పాకిస్తాన్‌ను మునుపు ఉగ్రవాదుల ‘సురక్షిత ప్రాంతంగా’ చెప్పినప్పటికీ, ఇప్పుడు ఆయన సానుకూలంగా మారారు. భారత్‌తో సంబంధాల్లో ఈ మార్పు ఒక టెన్షన్ పాయింట్‌గా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
షరీఫ్ అమెరికాలో యుఎన్ జనరల్ అసెంబ్లీ 80వ సెషన్లో పాల్గొనేందుకు వచ్చారు. గత మూడు రోజుల్లోనే ట్రంప్‌తో రెండోసారి కలిసారు. ఈ సమావేశం ఇండో-పాక్ సంబంధాలు, గాజా సంక్షోభం వంటి అంశాలపై కూడా ప్రభావం చూపవచ్చు.
