‘కల్కి 2898 ఏడీ’ ఉత్తమ చిత్రం
దుబాయ్, సెప్టెంబర్ 6, 2025: దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ (సైమా) 2025 వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో 2024 సంవత్సరంలో విశేష ప్రతిభ కనబర్చిన నటీనటులు, చిత్ర బృందాలకు అవార్డులు అందజేశారు. తెలుగు సినిమా రంగంలో ‘పుష్ప 2: ది రూల్’ హవా కొనసాగింది. ఈ చిత్రం నాలుగు ప్రధాన అవార్డులను సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవర్ ఫుల్ యాక్టింగ్ తో ‘ఉత్తమ నటుడు’ (తెలుగు) అవార్డును గెలుచుకోగా, రష్మిక మందన్న ‘ఉత్తమ నటి’ (తెలుగు) అవార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ ‘ఉత్తమ దర్శకుడు’గా, సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్ ‘ఉత్తమ సంగీత దర్శకుడు’గా అవార్డులను అందుకున్నారు. ‘పుష్ప 2’లో అల్లు అర్జున్, రష్మిక జోడీ మరోసారి తమ అద్భుతమైన కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరోవైపు, సైన్స్ ఫిక్షన్ జానర్లో సరికొత్త అనుభూతిని అందించిన ‘కల్కి 2898 ఏడీ’ ‘ఉత్తమ చిత్రం’ (తెలుగు) అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రంలో సుప్రీమ్ యాస్కిన్గా కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ అవార్డును, అమితాబ్ బచ్చన్ ‘ఉత్తమ సహాయ నటుడు’, అన్నా బెన్ ‘ఉత్తమ సహాయ నటి’ అవార్డులను అందుకున్నారు.

ఇతర విభాగాల్లో, ‘దేవర’ చిత్రంలోని ‘చుట్టమల్లే’ పాటకు రామజోగయ్య శాస్త్రి ‘ఉత్తమ గేయ రచయిత’గా, శిల్పా రావు ‘ఉత్తమ గాయని’గా అవార్డులు గెలుచుకున్నారు. ‘దేవర’ చిత్రానికి రత్నవేలు ‘ఉత్తమ సినిమాటోగ్రాఫర్’ అవార్డును సొంతం చేసుకున్నారు. ‘మత్తు వదలరా 2’ చిత్రంలో నటనకు సత్య ‘ఉత్తమ కమెడియన్’ అవార్డును గెలుచుకున్నారు.
‘హనుమాన్’ చిత్రం కూడా సైమా 2025లో సత్తా చాటింది. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్)’, నటుడు తేజ సజ్జా ‘ఉత్తమ నటుడు (క్రిటిక్స్)’ అవార్డులను అందుకున్నారు.
సైమా 2025 వేడుకలు రెండు రోజుల పాటు జరుగుతాయి. రెండో రోజు తమిళ, మలయాళ చిత్రాలకు అవార్డులు అందజేయనున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖులు, అభిమానులు ఈ వేడుకలను ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో విజేతలను అభినందిస్తున్నారు.
