న్యూఢిల్లీ: అఫ్ఘానిస్తాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్తులో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ప్రధాని, భూకంపం దాటికి తీవ్రంగా నష్టపోయిన అఫ్ఘానిస్తాన్‌కు అన్ని రకాల మానవతా సాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
బుధవారం తెల్లవారుజామున అఫ్ఘానిస్తాన్ తూర్పు ప్రాంతంలో సంభవించిన ఈ శక్తివంతమైన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం, సుమారు 1,000 మందికి పైగా మరణించగా, వేలాది మంది గాయపడినట్లు తెలుస్తోంది. అనేక గ్రామాలు నేలమట్టం కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విపత్కర పరిస్థితిపై స్పందిస్తూ ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో ఇలా పేర్కొన్నారు: “అఫ్ఘానిస్తాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి వార్త విన్నప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ కష్టకాలంలో అఫ్ఘాన్ ప్రజలకు మద్దతుగా నిలబడతామని, అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఇప్పటికే అనేక సంక్షోభాలతో సతమతం అవుతున్న అఫ్ఘానిస్తాన్‌కు ఈ ప్రకృతి విపత్తు మరింత కష్టాలను తెచ్చిపెట్టింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంక్షోభ సమయంలో అఫ్ఘానిస్తాన్‌కు భారత్ అన్ని విధాలా అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
