హజారిబాగ్ (ఛత్తీస్‌గఢ్): ఛత్తీస్‌గఢ్‌లోని హజారిబాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత సహదేవ్ సోరెన్ ఉన్నట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. అతని తలపై రూ. కోటి రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు గోర్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పండిత్రి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని భద్రతా దళాలకు తెలిసింది. దీంతో, భద్రతా దళాలు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.
భద్రతా దళాల రాకను పసిగట్టిన మావోయిస్టులు వెంటనే కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలు కూడా అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపాయి. ఇరు వర్గాల మధ్య కొంతసేపు భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు.
అనంతరం, ఘటనా స్థలంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో కీలకమైన మావోయిస్టు అగ్రనేత సహదేవ్ సోరెన్‌ను గుర్తించారు. అతని మరణం మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ అని భద్రతా దళాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.
