హైదరాబాద్: తెలంగాణలో గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో చర్చించిన సీఎం, ముఖ్యంగా టెంపుల్ సెంట్రిక్ ఘాట్ల అభివృద్ధి, శాశ్వత ప్రాతిపదికన వాటి ఏర్పాటుపై పలు కీలక సూచనలు చేశారు.
గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, భవిష్యత్తులో కూడా వినియోగపడేలా శాశ్వత ఘాట్లను నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. టెంపుల్ సెంట్రిక్ ఘాట్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని శాశ్వత ఘాట్ల నిర్మాణాలు చేపట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు.
బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలను క్షేత్రస్థాయిలో సందర్శించి, శాశ్వత ఘాట్ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను ఎంపిక చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఈ జాబితాలో బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతో పాటు ఇతర ప్రసిద్ధ ఆలయాలను చేర్చాలని, వాటికి ప్రత్యేకంగా జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతేకాకుండా, జాతీయ రహదారులు (NH), రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారుల (SH) సమీపంలో ఉన్న గోదావరి పరివాహక ఆలయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ శాశ్వత ఏర్పాట్ల ద్వారా పుష్కరాలు లేని సమయంలో కూడా భక్తులు సులభంగా స్నానమాచరించేందుకు వీలు కల్పించడం, ఆలయాలకు రాకపోకలు మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ సమీక్షలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
